ఇందిరమ్మ ఇళ్ల పథకం: మే నెలాఖరుకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పథకం లబ్ధిదారుల తుది జాబితాను మే నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పండుగ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన సభా స్థలి ఏర్పాట్లను బుధవారం ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ హరిత మరియు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిందని, ఏప్రిల్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష 20 వేల ఇండ్లు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వాలు పదేళ్లపాటు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రూ. 22,700 కోట్లతో మొత్తం 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాన్ని చేపట్టే స్థాయిని బట్టి (దశలవారీగా) రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మొదటి విడత కింద మంజూరైన ఇండ్లలో ఇప్పటికే 1.32 లక్షల గృహాల నిర్మాణం పూర్తయిందని, జూన్ నెలాఖరు నాటికి మరో 68-72 వేల ఇండ్ల శ్లాబ్ పనులు కూడా పూర్తవుతాయని పేర్కొన్నారు.

ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పథకానికి రావాల్సిన వాటా నిధులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుండి ఒక్కో ఇంటికి రావాల్సిన రూ. 1.13 లక్షల నిధుల కోసం మార్చి నుండి ఎదురుచూస్తున్నామని, ఆ నిధులు వస్తాయనే నమ్మకంతోనే లబ్ధిదారుల ఫైనల్ బిల్లులో కొంత మొత్తాన్ని ప్రస్తుతానికి ఆపామని వివరించారు. ఒకవేళ మరో 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోతే, ఆ బారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు పైసలతో సహా అందజేస్తుందని భరోసా ఇచ్చారు. దీంతోపాటు 40-50 ఏళ్ల క్రితం నాటి పాత కాలనీల్లోని శిథిలావస్థకు చేరిన ఇండ్ల స్థానంలో కూడా కొత్త ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టిని ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు