తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. సచివాలయం పరిసరాల్లోకి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నిరసన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి సంబంధించి ఎలాంటి తరుగు తీయకూడదని, తక్షణమే అన్నదాతలకు మద్దతు ధర కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఆమె స్పష్టం చేశారు.
సెక్రటేరియట్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిరసనకారులను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కవితతో పాటు ధర్నాలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులను, మహిళా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కల్వకంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆమె నిరంతరం ప్రజా సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఆమె వరుస నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోళ్ల సమస్యపై రైతుల పక్షాన నిలిచి సచివాలయం ముట్టడికి యత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానాలపై రైతుల అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ అరెస్ట్ పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.









