ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు.. ఫార్మర్స్ సిటీ తీసుకొస్తామన్న రఘునందన్ రావు…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని 100 శాతం రద్దు చేసి, తిరిగి ‘ఫార్మా సిటీ’ని పునరుద్ధరిస్తామని సంచలన ప్రకటన చేశారు. అక్కడ ఫార్మా సిటీ నిర్మించేందుకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం వ్యాపారాలు, కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని మండిపడ్డారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూములు పంచి పెట్టి బ్యాక్ ఎండ్ లబ్ది పొందాలని డ్రామాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

హరీష్ రావు చేసిన ఈ ప్రకటనపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత మాధవనేని రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రాంతం ఫార్మా సిటీనో, ఫ్యూచర్ సిటీనో కాదు.. అసలైన ‘ఫార్మర్స్ సిటీ’ (రైతుల నగరం) అని ఆయన సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కేవలం ప్రాజెక్టుల పేర్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక్క కంపెనీని కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతోనే గతంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని మొదట ‘ఫార్మర్స్ సిటీ’గా, ఆ తర్వాతే ఫార్మా సిటీగా లేదా ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద మార్చుతోందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం ముదిరింది. ఒకవైపు ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని తెస్తామని బీఆర్ఎస్ చెబుతుండగా, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తూ.. తాము రైతుల పక్షాన ‘ఫార్మర్స్ సిటీ’ని నిర్మిస్తామని ప్రకటించడంతో ఈ అంశం తెలంగాణ రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు