మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే పక్కా సమాచారంతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఆయనకు సంబంధించిన ఎనిమిది విభిన్న ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వంశీమోహన్‌కు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భారీ అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. గతంలో శేరిలింగంపల్లితో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఆర్డీవో (RDO)గా పనిచేసిన సమయంలో ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కాజేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వంశీమోహన్ సాగించిన భూదందాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురం పరిధిలో ఉన్న సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆయన అక్రమంగా కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రభుత్వ భూములను మొదట లూప్‌హోల్స్ ఉపయోగించి తన సొంత మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని, ఆ తర్వాత వాటిని భారీ ధరలకు రియల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ అక్రమ లావాదేవీలకు ప్రతిఫలంగా ఒక ప్రముఖ రియల్టర్ నుండి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్లను తన పేరిట గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) చేయించుకున్నట్లు ఏసీబీ విచారణలో స్పష్టమైంది.

ప్రభుత్వ అధికారిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారాన్ని ఏసీబీ సీరియస్‌గా తీసుకుంది. పట్టుబడిన డాక్యుమెంట్లు, గిఫ్ట్ డీడ్లు, ల్యాండ్ రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. వంశీమోహన్ బంధువులు, సన్నిహితుల పేర్లపై మరిన్ని బినామీ ఆస్తులు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అక్రమాస్తుల కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు