‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల్లల్లల్లో’కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్, శృతి హాసన్ తమ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రోమో చిత్రానికి మరింత ఊపును తెచ్చింది.

భోపాల్ వేదికగా రేపు భారీ స్థాయిలో సినిమాకు సంబంధించిన సంగీత వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకలోనే ‘హెల్లల్లల్లో’ పూర్తి పాటను అధికారికంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చారు. రెహమాన్ సంగీతం కావడం, దానికి తోడు ఇది రామ్ చరణ్ మార్క్ స్పెషల్ సాంగ్ కావడంతో ప్రేక్షకులు దీనికోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా, ఈ పాటలో శృతి హాసన్‌తో పాటు మరో స్టార్ కథానాయిక కూడా రహస్యంగా మెరవనుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని హంగులతో, అత్యంత భారీ నిర్మాణ విలువలతో సిద్ధమవుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు