బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా జోరుగా ప్రచారం సాగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియోనే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. ఆ వీడియోలో కంగనా సంప్రదాయ దుస్తులు ధరించి, మెడలో మంగళసూత్రంతో కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కంగనా ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా వివాహం చేసేసుకుందా అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నల వర్షం కురిపించడంతో ఈ వార్త ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉందని తేలింది. కంగనా రనౌత్ మెడలో మంగళసూత్రం ధరించడం వెనుక ఎలాంటి వ్యక్తిగత వివాహ బంధం లేదు, అదంతా కేవలం ఒక సినిమా షూటింగ్‌లో భాగం మాత్రమే. 2014లో విడుదలై దేశవ్యాప్తంగా భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘క్వీన్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘క్వీన్ 2’ చిత్రంలోని తన పాత్ర కోసం కంగనా ఈ కొత్త లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభమవ్వడంతో, అందులోని గెటప్‌లోనే ఆమె కెమెరా కంటికి చిక్కారు.
తాము కొంతకాలంగా ‘క్వీన్ 2’ కథపై వర్క్ చేస్తున్నామని, చివరికి దానికి ఒక స్పష్టమైన రూపం వచ్చిందని ఈ చిత్ర దర్శకుడు వికాస్ బహల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించారు. మొదటి భాగంలో పెళ్లి రద్దయిన తర్వాత ధైర్యంగా ఒంటరిగా హనీమూన్‌కు యూరప్ వెళ్లే ‘రాణి మెహ్రా’ అనే అమాయకమైన యువతి పాత్రలో కంగనా నటనకు జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ వస్తుండటం, అందులోనే రాణి మెహ్రా పాత్రకు పెళ్లయినట్లు చూపిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.









