ఆఫీసుల్ని తగులబెడదాం, మిలిటెంట్ దాడులు చేద్దాం: బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్క సుమన్ పిలుపు వివాదాస్పదం

సింగరేణి సంస్థ పరిరక్షణ, బొగ్గు గనుల వేలం అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సింగరేణి జీఎం ఆఫీసులను, సింగరేణి భవన్‌ను తగులబెట్టాలని, అవసరమైతే రైల్వే లైన్లను కూడా కోసి పడేయాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. “మిలిటెంట్ తరహాలో దాడులు చేద్దాం.. మీరు తగలబెడితే మళ్ళీ పైసలు కూడా అవే వస్తాయి” అంటూ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సమర్థించేలా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టడం ముమ్మాటికీ నేరపూరిత చర్యేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి భవన్ లాంటి కీలక కార్యాలయాలపై దాడులకు ప్రోత్సహించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేసే హక్కు ఉన్నప్పటికీ, ఇలా హింసను ప్రేరేపించేలా మాట్లాడటం సరైనది కాదని, ఆయనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు, పార్టీ కార్యక్రమాలకు రైతులు రావడం లేదని, ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో ముచ్చట్లు చెప్పడం పక్కన పెట్టి హింసాత్మకంగా పని చేయాలంటూ బాల్క సుమన్ అంతర్గత సంభాషణల్లో అన్నట్లుగా వస్తున్న మరికొన్ని వ్యాఖ్యలపై కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ వైరల్ వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారని, ఆయన వ్యాఖ్యల ఆధారంగా త్వరలోనే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు