రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం…

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో వివాహేతర సంబంధం, రూ.2 కోట్ల భారీ బీమా సొమ్ము కోసం ఓ భార్యే సుపారీ ఇచ్చి భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడిపేటకు చెందిన సాయిని కుమార్ (45) అనే వ్యక్తి మే 22న రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా భావించినప్పటికీ, అతని తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు. కుమార్ భార్య భారతికి, అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవడంతో పాటు, రోడ్డు ప్రమాదంలో చనిపోతే వచ్చే రూ.2 కోట్ల ఎల్.ఐ.సీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్మును కాజేయాలని భారతి, ఆమె ప్రియుడు సురేందర్ పథకం వేశారు. ఇందుకోసం కుమార్ తో గతంలో డబ్బుల విషయంలో గొడవపడిన రామ్ మల్లేష్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ మాట్లాడుకుని, గత నెలలోనే రూ.2 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. మల్లేష్ ఒంటరిగా ఈ పని చేయలేక శ్రీరామ్ అనే మరో వ్యక్తిని జతకలుపుకున్నాడు. మే 22న ముల్కల్ల గ్రామ శివారులో కుమార్ కు అతిగా మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి హతమార్చారు. అనంతరం అది రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాన్ని, మోటార్ సైకిల్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు.

ఈ రోడ్డు ప్రమాదంపై క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్తు చేసిన మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ బృందం, సాంకేతిక ఆధారాలు మరియు భారతి వ్యవహారశైలి ఆధారంగా ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా ఛేదించారు. నిందితుల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం పత్రాలతో పాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన భార్య భారతి, ప్రియుడు సురేందర్, సహకరించిన శ్రీరామ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామ్ మల్లేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు