ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం (AAFA) ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు మానవత్వంతో ముందుకు వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభిమాన సంఘం వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్ కుమార్తె నక్షిత పుట్టుకతోనే ‘అనోరెక్టల్ మాల్ఫార్మేషన్’ (ARM) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే ఈ చిన్నారికి రెండు శస్త్రచికిత్సలు జరగగా, త్వరలోనే మూడో సర్జరీ చేయాల్సి ఉంది. ఈ కష్టసమయంలో ఉన్న ఆ అభిమాని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారికి అండగా నిలవాలని నిర్ణయించింది.
చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రముఖ యువ నిర్మాత, అల్లు అర్జున్ సన్నిహితుడైన ‘బన్నీ’ వాసు చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. తమ హీరో అభిమానులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టకాలం వచ్చినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుండి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందిస్తూ తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ సక్సెస్ తర్వాత ఆయన వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాక’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత.. మలయాళంలో ‘మిన్నల్ మురళి’ వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బసిల్ జోసెఫ్ కాంబినేషన్‌లో మరో వైవిధ్యమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.









