హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్, కోకాపేట పరిసరాల్లో ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై ‘హైడ్రా’ (HYDRAA) ఉక్కుపాదం మోపింది. మార్కెట్‌లో ఎకరం రూ.150 కోట్లకు పైగా పలికే ఈ ప్రాంతాల్లో బడా రియల్టర్లు పక్కా ప్రణాళికతో సాగిస్తున్న భూదందాకు అడ్డుకట్ట వేసింది. నగరం నలువైపులా ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించి, ఒక్కరోజులోనే సుమారు రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువు శిఖం భూములను స్వాధీనం చేసుకుంది. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ భూముల చుట్టూ అధికారులు రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు.
ఈ మెగా ఆపరేషన్‌లో భాగంగా కోకాపేటలో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు సాగిస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) పరిధిలోని 1.09 ఎకరాల భూమిని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించుకుని ‘గోల్డ్‌ఫిష్ కాలనీ’ పేరుతో విల్లాలను నిర్మించింది. అంతేకాకుండా మిగిలిన చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి నివాసితుల కోసం లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులను నిర్మించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఆ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇదే ప్రాంతంలోని పెద్దచెరువు పరిధిలో బహుళ అంతస్తుల భవనాల కోసం ఆక్రమించిన సుమారు 22 ఎకరాల స్థలాన్ని కూడా కాపాడారు. ఒక్క కోకాపేటలోనే స్వాధీనం చేసుకున్న భూముల విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
మరోవైపు శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని ఈదులకుంట చెరువును ఏకంగా మ్యాప్ నుంచే తొలగించేందుకు జరిగిన భారీ కుట్రను హైడ్రా భగ్నం చేసింది. తమ్మిడికుంట చెరువు నిండినప్పుడు వచ్చే వరద నీటి కాలువను కబ్జాదారులు దారి మళ్లించి, చెరువు ఎండిపోయేలా చేశారు. హైడ్రా అధికారులు శాటిలైట్ చిత్రాలు, పాత ఎఫ్‌టీఎల్ రికార్డుల ఆధారంగా రూ.600 కోట్ల విలువైన 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని, దానికి ఆనుకుని ఉన్న రూ.500 కోట్ల విలువైన 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే భరత్‌నగర్-హఫీజ్‌పేట్ మార్గంలో రోడ్డు విస్తరణ కోసం జీహెచ్‌ఎంసీ సేకరించిన స్థలాన్ని వదలకుండా అక్రమంగా నిర్మించిన కార్యాలయం, గోశాలను కూల్చివేసి రూ.17 కోట్ల విలువైన 1700 గజాల స్థలాన్ని రోడ్డు విస్తరణకు అప్పగించారు. ఈ భారీ చర్యతో భూకబ్జాదారులకు ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు పంపినట్లయింది.









