తమిళనాడు సీఎం విజయ్‌కు థ్యాంక్స్.. పరిస్థితిని అర్థం చేసుకున్నారు: హీరో విశాల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నటుడు, రాజకీయ నేత విజయ్ పాలనాపరంగా దూకుడు పెంచారు. శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తూనే, ప్రజాకర్షక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. చిత్ర పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. తాజాగా కోలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కొత్తగా విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు మొదటి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలను (5 Shows) ప్రదర్శించుకోవడానికి అనుమతినిస్తూ ఆయన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు ఐదు షోల ప్రదర్శన కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు కలిసి నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయాన్ని తమిళ చిత్ర పరిశ్రమ హర్షిస్తూ స్వాగతించింది.

ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్పందిస్తూ సాషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. “ప్రియమైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళనాడులో అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం ప్రజానాయకుడిగా మారిన విజయ్.. చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత కష్టతరమైన పరిస్థితులను, ఇండస్ట్రీ అవసరాలను చక్కగా అర్థం చేసుకున్నారు. కొత్త సినిమాలు విడుదలైన మొదటి 7 రోజులు రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతించడం చాలా ఆనందంగా ఉంది” అని విశాల్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో ఉన్న సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా సీఎం విజయ్ నుండి మరిన్ని మంచి నిర్ణయాలు, జీవోలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెద్ద సినిమాలు, కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన ప్రారంభంలో కలెక్షన్లు రాబట్టడానికి వీలుగా డైలీ 5 షోలకు అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన ఈ వినతిపై సీఎం విజయ్ సానుకూలంగా స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయడంతో కోలీవుడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నిర్ణయం వల్ల సినిమా థియేటర్ల మనుగడ సాగడమే కాకుండా, నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ ఊరట లభిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై తమిళనాడుతో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ విస్తృతంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు