కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ ప్రక్రియ సమయంలో బూత్ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓట్ల పరిరక్షణపై తమ నాయకులకు మరియు ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఈ శిక్షణా తరగతుల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితర ముఖ్య నేతలు పాల్గొని దిశానిర్దేశం చేశారు.
గాంధీ భవన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ శిక్షణ విభాగానికి చెందిన నిపుణులు సౌరభ్, అనూష, నిశాంత్ లు కాంగ్రెస్ పార్టీ ‘మాస్టర్ ట్రైనీలకు’ పకడ్బందీగా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ నైపుణ్యాలు పెంపొందించుకున్న మాస్టర్ ట్రైనీలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLAs) క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ప్రక్రియ ద్వారా ఇప్పటికే జిల్లా, మండల కమిటీల ఏర్పాటును దాదాపు పూర్తి చేశామని వెల్లడించారు.
ఈ శిక్షణ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ రాజకీయాల్లోని పరిణామాలను ప్రస్తావిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేసిన రాజకీయ కుట్రల వల్ల ఏకంగా 93 లక్షల జెన్యూన్ ఓట్లను తొలగించారని, తద్వారా అక్కడ ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ వ్యవస్థలను వాడుకుని చేసే ఇటువంటి కుట్రలు తెలంగాణలో సాగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, అర్హులైన ప్రతి ఓటును కాపాడుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.









