పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన: కౌమారప్రాయంలో పారిపోయే కేసులపై కీలక వ్యాఖ్యలు

మైనర్లపై లైంగిక దోపిడీని అడ్డుకోవడానికి తీసుకొచ్చిన పోక్సో (POCSO) చట్టం దుర్వినియోగానికి గురవుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కౌమారప్రాయంలో (15-18 ఏళ్ల వయసులో) బాలికలు తమ భాగస్వాములతో ఇష్టపూర్వకంగా పారిపోయినప్పుడు, తల్లిదండ్రులు తమ పరువును కాపాడుకోవడానికి ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు ఒక అమ్మాయి, అబ్బాయి ఇళ్లనుంచి పారిపోవడాన్ని ప్రభుత్వం ఎలా నిరోధించగలదని కోర్టు ప్రశ్నించింది.

కౌమారదశలో ఉన్నవారి గోప్యత హక్కుకు సంబంధించిన ఓ సుమోటో కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో కలకత్తా హైకోర్టు “కౌమార ప్రాయంలో లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి” అంటూ ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ఈ సందర్భంగా బెంగాల్‌కు చెందిన ఓ కేసును ప్రస్తావిస్తూ.. 25 ఏళ్ల యువకుడితో వెళ్లిపోయిన మైనర్ బాలికకు ప్రస్తుతం ఒక బిడ్డ ఉందని, ఆమె ఇప్పుడు తన భర్తతో సంతోషంగా స్థిరపడిందని సీనియర్ లాయర్ మాధవి దివాన్ కోర్టుకు వివరించారు. ఇలాంటి కేసులలో చట్టప్రకారం తాము నిందితులను నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తోందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఈ తరహా సమస్యలను నివారించడానికి చిన్న వయసు నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లాయర్ మాధవి దివాన్ కోర్టుకు తెలిపారు. ఇందులో భాగంగా 6వ తరగతి నుంచే పోక్సో చట్టంపై అవగాహనను పాఠ్యాంశాల్లో చేర్చేలా ‘కౌమార విద్య’ (Adolescent Education) ను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన లాయర్ సిఫార్సు చేశారు. అయితే కేసుల పర్యవేక్షణకు కేంద్రమే ఒక ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు