భద్రాచలం ఏరియా ఆసుపత్రి సమస్యలపై రణబేరి నిరసన దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జులై 15: TODAY 9
భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రణబేరి నిరసన దీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర సౌకర్యాల లేమి వంటి అంశాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ నాయకులు మానె రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు సేవలందించే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం రావులపల్లి రాంప్రసాద్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైద్యుల కొరత, పరికరాల లేమి, రోగులకు సరైన సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని హితవు పలికారు. ఏరియా ఆసుపత్రి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు… దీక్షలో పాల్గొన్న వారిలో, ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, పుడతా రమేష్, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళా నేతలు తదితరులు ఉన్నారు.
దీక్షకు మద్దతు ప్రకటించిన ఆదివాసి నేతలు ..
భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోని ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్న “నిరసన దీక్ష” కార్యక్రమంలో భద్రాచలం ఆదివాసి సమితి (BAS) ప్రధాన కార్యదర్శి & అడ్వకేట్ పాయం రవివర్మ , ముఖ్య సలహాదారు పూనెం వీరభద్రం పాల్గొని మద్దతు ప్రకటించారు.










