భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ ‘స్కైరూట్’ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ చరిత్రాత్మక ప్రయోగం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అంతరిక్ష సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణల్లో ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఈ ప్రయోగం ఒక చక్కటి నిదర్శనమని కొనియాడుతూ ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు, స్టార్టప్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ చారిత్రాత్మక విజయం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన దార్శనికతకు, ఆయన దేశీయ సాంకేతికతకు అందిస్తున్న అపారమైన ప్రోత్సాహానికి దక్కిన ప్రతిఫలం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా దేశంలో సరికొత్త స్టార్టప్‌ల అభివృద్ధికి, యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని రగిలించడానికి అద్భుతమైన అవకాశాలు వచ్చాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పట్టుదల, వినూత్న ఆలోచనలు ఉంటే ప్రైవేట్ రంగంలోనూ సరికొత్త అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ప్రయోగం నిరూపించిందని, ఇది ప్రతి యువ భారతీయుడికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో ప్రైవేట్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పాత్రను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. శాస్త్రీయ నైపుణ్యాన్ని అందిస్తూ యువతను, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఇస్రో ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ అద్భుత రాకెట్‌ను విజయవంతంగా తయారు చేసిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ బృందంతో పాటు వారికి సహకరించిన ఇస్రో, ఇన్-స్పేస్ (IN-SPACe) సంస్థల శాస్త్రవేత్తలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ.. ఈ విజయగాథ రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచి, అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.









