అన్నా లెజినోవా తిరుమల యాత్ర: కాలినడకన కొండెక్కిన పవన్ కళ్యాణ్ సతీమణి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భుజం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలోకి రావాలని కోరుకుంటూ అన్నా లెజినోవా ఈ ప్రత్యేక తిరుమల యాత్ర చేపట్టారు. శుక్రవారం నాడు అలిపిరి నడక మార్గంలో సామాన్య భక్తులతో కలిసి మెట్లు ఎక్కి ఆమె తిరుమల కొండపైకి చేరుకోగా, శనివారం ఉదయం పవిత్ర సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తాను శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లను అన్నా లెజినోవా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎంతో ఎమోషనల్‌గా వివరించారు. సామాన్య భక్తులతో కలిసి కొండ మెట్లు ఎక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెబుతూనే, తిరుమల కొండ ఎక్కడం అంత సులువు కాదని తనకు ముందే తెలుసని, కానీ ఈ స్థాయిలో కఠినంగా ఉంటుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొన్నారు. ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాదు.. ఒక రకమైన మానసిక పరీక్ష అని, నడక మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు “ఇక నావల్ల కాదు, ఇక్కడే ఆపేసి వెనక్కి వెళ్ళిపోదామా” అనిపించిన బలహీన క్షణాలు ఎన్నో ఎదురయ్యాయని ఆమె ఆవేదన పంచుకున్నారు.

అలాంటి నిరాశ ఎదురైన సమయంలో తాను ఆ సవాలును ఎలా అధిగమించిందో కూడా ఆమె వివరించారు. సరిగ్గా అలాంటి నిరాశ నన్ను ఆవహించిన సమయంలో.. నేను పైకి ఎక్కాల్సిన అడుగుల (మెట్ల) వైపు చూడటం మానేశానని, దానికి బదులుగా నా జీవితంలో భగవంతుడు నాకు ప్రసాదించిన ఆశీర్వాదాలను, మంచి విషయాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకోవడం ప్రారంభించానని తెలిపారు. ఆ ఆలోచనలే తనకు కొండ ఎక్కడానికి కొండంత బలాన్ని ఇచ్చాయని అన్నా లెజినోవా తన మనసులోని మాటను నెటిజన్లతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఆమె పడ్డ శ్రమ, పెట్టిన ఈ సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతూ విపరీతంగా వైరల్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు