గుంటూరు నగరంలో ఒక మహిళపై జరిగిన దాడి ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవిపై తాను చేసిన ఆరోపణలకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివాదంలో తనపై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్న ఎమ్మెల్యే మాధవికి నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లవచ్చని సవాల్ విసిరారు. ఎలాంటి న్యాయపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.
గుంటూరులో బాధితురాలిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసిన ఈ అమానుష ఘటనను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఒక టీడీపీ నాయకుడు మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించినా, ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆయన నిలదీశారు. ఎమ్మెల్యే నేరుగా ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని, ఈ అరాచకానికి ఎమ్మెల్యే మాధవినే ప్రధాన కారకురాలని మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఒక మహిళకు అందడంతో, ఆమె వాటిని ఇతరులకు షేర్ చేసిందని.. అయితే ఇప్పుడు పోలీసులు సదరు మహిళనే లక్ష్యంగా చేసుకుని ఆమె సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఒకవేళ ఆ వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు రాకపోయి ఉంటే పోలీసులు అసలు కేసు కూడా నమోదు చేసేవారు కాదని విమర్శించారు. రాష్ట్రంలో హోంశాఖ, పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని, చట్టప్రకారం నడుచుకోకుండా అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటే భవిష్యత్తులో పోలీసులకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు వచ్చే ఎన్నికల్లో మహిళలే ఓటు రూపంలో పెద్ద దావా వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.









