బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆమె, ఆ తర్వాత హాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న ఆమె, ఒక ఇంటర్వ్యూలో తనను ఉద్దేశపూర్వకంగానే కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి తొలగించారని సంచలన నిజాలు వెల్లడించారు.
కొందరిని మెప్పించలేదనే కారణంతో, మరికొందరు చెప్పినట్లు నడుచుకోలేదనే నెపంతో తన చేతికి వచ్చిన పలు అవకాశాలు జారిపోయాయని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి రాజీ పడాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇతరులలాగా అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయకపోవడం వల్లనే కొన్ని పెద్ద సినిమాలు నా నుంచి వెళ్లిపోయాయని స్పష్టం చేశారు. 2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ షూటింగ్ సమయంలో మరో సినిమాకు తన్ను ఎంపిక చేసి, ఆ తర్వాత హీరో వచ్చి వేరే హీరోయిన్ కోసం అనుకున్న పాత్ర అని చెప్పి తనను తప్పించారని ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఆ సంఘటన తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ, ఎవరిపై కోపం పెంచుకోకుండా నటనపైనే పూర్తి దృష్టి పెట్టానని ప్రియాంక వివరించారు. ఎన్నో అవమానాలు, ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ తన ప్రతిభనే నమ్ముకుని హాలీవుడ్లో సైతం సక్సెస్ సాధించిన ఆమె, ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ సినిమాతో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.









