పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముజఫరాబాద్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)కు ప్రధాని కావాలని ఉందంటూ ఎవరూ ఊహించని ఆకాంక్షను వ్యక్తంచేశారు. అక్కడ తమ పార్టీ గెలిస్తే తన సోదరుడు, ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరి మరీ పీఓకే ప్రధాని బాధ్యతలు చేపడతానని, ఆ ప్రాంత అభివృద్ధిని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అయితే నవాజ్ షరీఫ్ ఈ తరహా ప్రకటనలు చేయడానికి పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నిరసనలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా పీఓకే వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్బంధ చర్యలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల తీవ్ర ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే నవాజ్ షరీఫ్ ఇలాంటి హామీల డ్రామా ఆడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారతదేశం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని తేల్చిచెప్పింది. అక్కడ పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా భూభాగాలను ఆక్రమించిందని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆక్రమిత ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి ఎన్నికలను లేదా అక్కడి తాత్కాలిక అసెంబ్లీలను భారతదేశం గుర్తించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.









