ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం, వారు నేరుగా భోజనశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి కింద కూర్చుని ముచ్చటిస్తూ భోజనం చేయడం విశేషం.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యత, రుచి గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వయంగా ఆరా తీశారు. అనంతరం అక్కడి అధికారులతో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని, విటమిన్ లోపాలను పూర్తిగా నివారించేలా సమతుల్య ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేయగా, ఇప్పటికే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయిస్తున్నామని, ఉదయం పూట రాగి మాల్ట్, మధ్యాహ్నం చిక్కీ అందిస్తున్నామని మంత్రి లోకేశ్ వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో స్నాక్‌గా చిక్కీలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఒక కీలక సూచన చేశారు.
భోజనం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రితో ఫొటోలు దిగాలని ఉందంటూ పలువురు విద్యార్థులు తమ ఆశను వ్యక్తపరిచారు. దానికి సీఎం చంద్రబాబు వెంటనే సానుకూలంగా స్పందించి, ఆ పిల్లలందరితో కలిసి చాలా ఆప్యాయంగా ఫొటోలు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్వయంగా తమ పక్కన కూర్చుని భోజనం చేసి, ఎంతో ప్రేమగా పలకరించడంతో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.









