కేంద్రంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్‌ పార్టీ కీలక సందేశం..!

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో శనివారం జరగనున్న మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం లేదా ఆయన్ను పదవి నుంచి తొలగించడం తప్ప మరో పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. మంత్రి రాజీనామాపై సానుకూల నిర్ణయం లేకుంటే చర్చలు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా ప్రకటించారు.

 

శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చల్లో మూడు ప్రధాన డిమాండ్లు, పరీక్షల సంస్కరణలకు సంబంధించిన ఐదు సూచనలను సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం, ఆత్మహత్య చేసుకున్న నీట్‌ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి శనివారం తుది సమాధానం ఇస్తామని మంత్రులు తెలిపారు.

 

అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి వెనుక ప్రభుత్వం పూర్తిగా నిలబడిందని, రాజీనామా సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పేపర్‌ లీక్‌లపై వేగంగా విచారణ పూర్తిచేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే పేపర్‌ లీక్‌ నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు సవరణలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.

 

ఇక ఎన్‌టీఏలో 47 మంది అధికారులను తొలగించడం, విద్యాశాఖ కార్యదర్శిని మార్చడం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ, అవి సరిపోవని సీజేపీ పేర్కొంది. పేపర్‌ లీక్‌లకు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొన్న విషాదాలకు రాజకీయ బాధ్యత విద్యాశాఖ మంత్రిదేనని, అందుకే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందేనని అశుతోష్‌ రాంకా మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగే మూడో విడత చర్చల్లో ఈ అంశమే కీలకంగా మారనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు