‘మెగా డీఎస్సీ’ని ‘దగా డీఎస్సీ’గా మార్చారు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో భారీగా అక్రమాలు, కుంభకోణం జరిగాయంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెకండ్ గేట్ వద్ద వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరు చెప్పి నిరుద్యోగులను ఘోరంగా మోసం చేస్తూ, దానిని ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని ఆరోపించారు.
జీవో 420తో అక్రమ పోస్టుల కట్టబెట్టు.. లోకేశ్ రాజీనామాకు డిమాండ్ ప్రభుత్వం జీవో 420 జారీ చేసి అర్హత లేని దాదాపు 427 మందికి అక్రమంగా పోస్టులు కట్టబెట్టిందని, పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని రోజా విమర్శించారు. ఈ డీఎస్సీ స్కామ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన దిగిపోయే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత.. విద్యార్థుల జీవితాలతో ఆటలు రూ. 7 వేల కోట్ల బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని రోజా ధ్వజమెత్తారు. ప్రభుత్వం కేవలం తమకు అనుకూలంగా ఉండే ప్రచార పత్రికలను కాపాడుకోవడంలో మునిగితేలుతోందే తప్ప, మహిళల రక్షణను, నిరుద్యోగుల భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరఫున క్షేత్రస్థాయి పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.









