కుమామోటో కేంద్రంగా కుదిపేసిన భూకంపం జపాన్ దేశంలో మంగళవారం భారీ భూకంపం సంభవించి తీవ్ర కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) గుర్తించింది. సముద్ర ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తీర ప్రాంతాలకు సునామీ ముప్పు భారీ భూకంపం నేపథ్యంలో సముద్రంలో ఒక మీటరు (3.28 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందన్న అంచనాలతో అధికారులు పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్‌లకు ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు పంపింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ వెంటనే అప్రమత్తమై సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
నెల రోజుల వ్యవధిలో రెండోసారి జపాన్‌లో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి భారీ భూకంపం సంభవించడం ఇది రెండోసారి. గత జూన్ 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతమైన పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంచున నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై విస్తరించి ఉండటంతో ఇక్కడ ఏటా వందలాది ప్రకంపనలు వస్తుంటాయి. గతంలో 2011లో వచ్చిన 9.0 తీవ్రత భూకంపం, సునామీ వల్ల సుమారు 18,500 మంది మరణించిన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ జపాన్ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.









