బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన స్వదేశంలో అరెస్టు కావడం, జైలు శిక్ష లేదా ఉరిశిక్షకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే డిసెంబర్ నాటికి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రిజర్వేషన్ల వ్యతిరేక తీవ్ర ప్రజా ఉద్యమంతో 2024 ఆగస్టులో తన పదవికి రాజీనామా చేసి, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భారత్‌కు పారిపోయి వచ్చిన హసీనా.. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు. స్వదేశానికి తిరిగి రావడం వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏఎన్ఎఫ్, రాయిటర్స్ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె వెల్లడించారు.
తాను, తన రాజకీయ మిత్రులు ప్రవాసం నుంచి తిరిగి వచ్చి బంగ్లాదేశ్‌లోని కోర్టులను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని షేక్ హసీనా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ తన పార్టీ అయిన అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు, ఇబ్బందులకు గురవుతున్నారని, వారి కోసం తాను వెళ్లక తప్పదని పేర్కొన్నారు. “ఒకవేళ నాకు మరణమే రాసిపెట్టి ఉంటే.. అది నా సొంత దేశం మట్టిలోనే రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే నా తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయో, ఎక్కడైతే వారి రక్తం చిందిందో.. అక్కడే నేను కూడా కన్నుమూయాలనేది నా చివరి కోరిక” అంటూ హసీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
2024 జులై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలో జరిగిన హింసాత్మక నిరసనలపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల్లో వందలాది మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’ ఆమెకు మరణశిక్ష విధించింది. హసీనా పతనం తర్వాత దేశంలో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికలలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించింది. దశాబ్దాల పాటు సాగిన ‘బ్యాటిల్ ఆఫ్ బేగమ్స్’ (ఖలేదా జియా, షేక్ హసీనా వైరం) రాజకీయాల తర్వాత.. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.









