మరోసారి మంచి మనసును చాటుకున్న మెగాప్రిన్స్.. అభిమాని ప్రాణం కాపాడిన వరుణ్ తేజ్!

ప్రముఖ సినీ నటుడు, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. తీవ్రమైన ట్యూమర్‌ (గడ్డ) సమస్యతో బాధపడుతున్న తన అభిమానికి అత్యవసర వైద్య సేవలు అందించడమే కాకుండా, పెద్ద దిక్కుగా నిలిచి మానవత్వాన్ని ప్రదర్శించారు. బాధితుడిని అనంతపురం నుండి హైదరాబాద్‌ తరలించి ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించడంతో పాటు, శస్త్రచికిత్సకు అయ్యే పూర్తి వ్యయాన్ని తానే స్వయంగా భరించి అభిమాని కుటుంబంలో కొత్త వెలుగులు నింపారు.

అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు సురేష్ పాటిల్ కొంతకాలంగా ఈ ట్యూమర్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ తేజ్ తక్షణమే స్పందించారు. తన తల్లి పద్మజ సహకారంతో సురేష్‌ను హైదరాబాద్‌లోని ‘సిటీ న్యూరో సెంటర్‌’కు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రి నిపుణులతో స్వయంగా మాట్లాడి, శస్త్రచికిత్స విజయవంతం అయ్యేలా అన్ని రకాలుగా అండగా నిలిచారు.

వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సురేష్ పాటిల్‌కు ఆపరేషన్ పూర్తయి, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. చికిత్స సమయంలో బాధితుడి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని వసతులను వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నారు. కాగా, గతంలోనూ అనంతపురం జిల్లాకు చెందిన మరో అభిమాని మరణించినప్పుడు వారి కుటుంబానికి వరుణ్ ఆర్థిక సహాయం చేశారు. తన పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, కష్టకాలంలో అభిమానులను ఆదుకుంటున్న వరుణ్ తేజ్ వైఖరిపై సినీ, రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు