భోగాపురం ఎయిర్‌పోర్టులో చారిత్రాత్మక ఘనత: 13 వేల మందితో థింసా నృత్యం.. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురం వేదికగా గిరిజన విద్యార్థినులు, మహిళలు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో సుమారు 13,000 మంది ఏకకాలంలో సంప్రదాయ ‘థింసా’ నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. రేపు (శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు చేసిన ముందస్తు రిహార్సల్స్‌లో భాగంగా ఈ భారీ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు.

మన్యం ప్రాంత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వివిధ ఐటీడీఏ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా గులాబీ, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి, లయబద్ధమైన అడుగులతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ మహా ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించి, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జరిగిందని నిర్ధారిస్తూ అధికారికంగా రికార్డును ప్రకటించారు.

ఈ చారిత్రాత్మక వేడుకలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పాల్గొని, గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అధికారుల సమక్షంలో ఆమె గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. రోజుల తరబడి కఠోర సాధన చేసి గిరిజన కళారూపాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన మహిళలను, విద్యార్థినులను మరియు వారికి సహకరించిన అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు