ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై విధిస్తున్న వివిధ రకాల సేవా ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (APGB) ప్రకటించింది. జులై 1 నుంచి పొందిన రుణాలకు వర్తించే ఈ నిర్ణయం వల్ల ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలోని దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఏటా రూ. 500 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.
గతంలో డ్వాక్రా రుణాలపై బ్యాంకులు ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్, డాక్యుమెంటేషన్, లెడ్జర్ ఫోలియో, పాస్‌బుక్ అప్‌డేట్, ఎస్‌హెచ్‌జీ స్టేట్‌మెంట్ ప్రింటింగ్ వంటి పలు రకాల ఛార్జీలను వసూలు చేసేవి. ఇప్పటికే ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకులు ఈ ఫీజులను నిలిపివేయగా, తాజాగా గ్రామీణ బ్యాంకు కూడా వాటిని పూర్తిగా రద్దు చేసింది. దీనికి తోడు రూ. 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడంతో, రూ. 20 లక్షల రుణం తీసుకునే ఒక్కో సంఘానికి ఏటా ప్రాసెసింగ్ మరియు వడ్డీ తగ్గుదల రూపంలో దాదాపు రూ. 25,000 వరకు ఆదా కానుంది.
ఏపీ గ్రామీణ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు బ్యాంకులతో సమీక్షలు నిర్వహించి ఈ మాఫీ దిశగా అడుగులు వేయించారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు మద్దతుగా రాష్ట్రంలోని ఇతర బ్యాంకులు కూడా ఇదే తరహాలో సేవా ఛార్జీలను రద్దు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.









