నల్లమలలో పెద్దపులి హతం: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..

శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలోని గిద్దలూరు అటవీ డివిజన్ రాచర్ల బీట్ తెట్టుమడుగు వద్ద పెద్దపులి కళేబరం లభించడం తీవ్ర కలకలం రేపింది. రహదారికి సమీపంలోనే ఈ ఘటన జరగడం మరియు పులి చనిపోయి రెండు వారాలు దాటినా అటవీ సిబ్బంది గుర్తించకపోవడం క్షేత్రస్థాయి గస్తీ విఫలమైందనడానికి అద్దం పడుతోంది. వెదురు బొంగులు తెచ్చుకునే పేదలపై ప్రతాపం చూపే అధికారులు, వేటగాళ్లు పులులను చంపుతుంటే కనీసం పసిగట్టలేకపోతున్నారని స్థానిక నాయకులు మరియు ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

నల్లమలలో పెద్దపులి మృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించి, పారదర్శకమైన ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ వ్యవస్థను సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ‘హైపవర్డ్ కమిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు వేగవంతం చేసి, అనుమానితుల కాల్ డేటా ఆధారంగా వేటగాళ్ల నెట్‌వర్క్‌పై దాడులు నిర్వహించారు.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు, అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పులి గోళ్లు మరియు వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే పులిని ఎలా హతమార్చారనే విషయాన్ని అధికారులు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఫోరెన్సిక్ మరియు పోస్టుమార్టం నివేదికల ఆధారంగా పూర్తి నిజాలు బయటకు రానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు