అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో పరీక్షలు: డీఎస్సీపై నారా లోకేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారమే తదుపరి డీఎస్సీ (DSC) ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, డిసెంబర్ నెలలోనే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా నోటిఫికేషన్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామని నొక్కి చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు