ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని మరియు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికా, జర్మనీ మరియు చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి లభించింది. అయితే, ఈ పర్యటనకుగాను రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, బస చేసే వివరాలు మరియు పర్యటన షెడ్యూల్‌ను కోర్టుకు అందించాలని ఆదేశించింది. కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందడంతో పాటు పర్యటన ముగిశాక సెప్టెంబర్ 18 లోగా పాస్‌పోర్ట్‌ను తిరిగి కోర్టులో జమ చేయాలని షరతు విధించింది.
2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో బెయిల్ పొందిన సందర్భంగా, రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పగించారు. విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి వస్తే ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరి అనే హైకోర్టు నిబంధన మేరకు సీఎం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది.









