తమిళ ప్రముఖ నటుడు ధనుష్ తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు ఓ అద్భుతమైన కానుకను అందించి తన ఉదారతను చాటుకున్నారు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాలకు ఆయన స్వయంగా మూడు అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చారు. ధనుష్ చేసిన ఈ సాయానికి గౌరవసూచకంగా పాఠశాల యాజమాన్యం ఆ భవనానికి ‘ధనుష్ బ్లాక్’ అని నామకరణం చేసింది.
ధనుష్ పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో 1999 బ్యాచ్లో చదువుకున్నారు. ఇటీవల జరిగిన నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ధనుష్ తన పాఠశాల సహచరుడు, సినీ ఛాయాగ్రాహకుడు (సినిమాటోగ్రాఫర్) కుమరన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ పాఠశాల ప్రాంగణంలో తన గురువుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోగా, ఆ దృశ్యాలు అక్కడున్న వారిని ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రాఫర్ కుమరన్ మాట్లాడుతూ.. పాఠశాల భవనాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ భవనాన్ని నిర్మించారని తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు ఖాళీ స్థలాల్లో మరిన్ని కొత్త భవనాలను కూడా నిర్మిస్తానని ధనుష్ హామీ ఇచ్చారని వెల్లడించారు.









