నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో బాధపడుతున్న పేదలకు ఉపశమనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సబ్సిడీపై సన్న బియ్యం అందిస్తున్న కూటమి ప్రభుత్వం, త్వరలోనే రైతు బజార్ల ద్వారా కందిపప్పు, వంట నూనెలను కూడా తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మార్కెట్లో ధరల స్థిరీకరణపై నిరంతరం దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 150 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిపిటి స్టీమ్డ్ బియ్యాన్ని కిలో రూ.52కే, బిపిటి రా బియ్యాన్ని కిలో రూ.50కే ప్రజలకు అందుబాటులో ఉంచామని మంత్రి గుర్తు చేశారు. బియ్యం పంపిణీ తరహాలోనే కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యవసరాలను కూడా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర సరుకుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సబ్సిడీ ప్రయోజనాలు అందేలా సేవలను విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.









