అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అత్యంత భద్రత కలిగిన అధికారిక హెలికాప్టర్ ‘మెరైన్ వన్’ ఒక ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి వెళ్లడంతో ఆకాశంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆగస్టు 4న డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి కాలిఫోర్నియా పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో రాజధాని గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATC) మరియు విమాన పైలట్ల మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడటమే ఈ తీవ్రమైన భద్రతా వైఫల్యానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
విమానయాన నియమావళి ప్రకారం గగనతలంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ల మధ్య కనీసం మైలున్నర సురక్షిత దూరం ఉండాల్సి ఉండగా, సమాచార లోపంతో మెరైన్ వన్ మరియు ప్యాసింజర్ విమానం మధ్య దూరం ఒక మైలు కంటే తక్కువకు తగ్గిపోయింది. ప్రమాద తీవ్రతను తక్షణమే గ్రహించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి, రేడియో సంకేతాల ద్వారా ఇరు ఎయిర్‌క్రాఫ్ట్‌ల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు వెంటనే తమ ప్రయాణ దిశలను మార్చుకోవడంతో ఒక ఘోర గగనతల ప్రమాదం తృటిలో తప్పి ఊపిరి పీల్చుకున్నారు.
అధ్యక్షుడి భద్రతకే ముప్పు వాటిల్లేలా జరిగిన ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాయి. ఈ పరిణామంపై వైట్‌హౌస్ స్పందిస్తూ, మెరైన్ వన్ను అత్యంత అనుభవజ్ఞులైన సైనిక పైలట్లు నడుపుతారని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నారని మరియు ఆయన కాలిఫోర్నియా పర్యటన యథావిధిగా కొనసాగిందని వెల్లడించింది.









