ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం బిల్లును వెనక్కి తీసుకుంటూ కూటమి ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది.
ఈ నిర్ణయంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, హోంమంత్రి వంగలపూడి అనితను ‘డమ్మీ’ హోంమంత్రిగా అభివర్ణించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అనిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ చట్టాన్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరారు. చట్టం పేరు మార్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ మహిళల రక్షణ కోసం దీనిని యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.









