‘యాక్సిడెంట్‌లా కనిపించేలా చంపెయ్‌’: భార్య చాటింగ్ చూసి భర్త షాక్, పోలీసులకు ఫిర్యాదు

తన భార్యే తన ప్రాణాలను తీసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన సంచలన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో వెలుగుచూసింది. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు, సూర్యాపేట జిల్లాకు చెందిన యువతిని 2016లో వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న రాజేశ్వరరావు, ఇటీవల భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమె మొబైల్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లను పరిశీలించగా ఈ హత్య కుట్ర బయటపడింది.

మొబైల్‌లో ఉన్న సందేశాల ప్రకారం.. భర్తను ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా రోడ్డు ప్రమాదం (యాక్సిడెంట్)లా చిత్రీకరించి హత్య చేయాలని భార్య తనతో పరిచయం ఉన్న పురిమెట్ల సైదులు అనే వ్యక్తికి పలుమార్లు మెసేజ్ చేసినట్లు తేలింది. ఈ దారుణమైన సంభాషణల స్క్రీన్‌షాట్లను రాజేశ్వరరావు సేకరించి పోలీసులకు ఆధారాలుగా అందించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, భార్య మరియు ఆమె ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు డోర్నకల్ పోలీసులు కేసును జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి, సంఘటనల పరిధి దృష్ట్యా కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. తాజాగా బాధితుడు ఖమ్మం రూరల్ పోలీసులను కలిసి పూర్తి వివరాలు, ఆధారాలు సమర్పించగా, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు