హైదరాబాద్ లో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన (ఆదివారం) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అన్ని రకాల వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మరియు రెస్టారెంట్లను పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేశారు.
ఈ మద్యం నిషేధ ఆంక్షలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో కఠినంగా అమలు కానున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్ మరియు చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపినా లేదా బార్లు తెరిచి ఉంచినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ శాఖ హెచ్చరించింది. పండుగ వాతావరణం ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు.









