రాజమండ్రి ఘటన: వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. శనివారం వైద్యులు ఆమెకు అప్నియా పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా, శరీరం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వైద్యులు వివరిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రియాంక, ఆగస్టు 3వ తేదీ రాత్రి తోటి విద్యార్థితో కలిసి సినిమా చూసి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టి ప్రియాంకపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు.

ఈ ఘటనకు కారణమైన సురవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య విద్యార్థిని ప్రియాంక కోలుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు