మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు.. లోకేశ్ రాజీనామా చేయాలి: రోజా డిమాండ్

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని, వీటిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఆమె మాట్లాడారు. అర్హులైన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, లంచాలు దండుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.

డీఎస్సీ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యారంగ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ దీక్షా శిబిరాలపై కోడిగుడ్లతో దాడులు చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించేంత వరకు పోరాటం ఆపేది లేదని, త్వరలోనే తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు