రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్లతో జాగ్రత్త: అమ్మాయిలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

సోషల్ మీడియాలో ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్ల పేరుతో జరుగుతున్న కొత్త రకం మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ యువతులను, అమ్మాయిలను తీవ్రంగా హెచ్చరించారు. ఒంటరితనాన్ని పోగొడతామని, కాఫీ డేట్‌లు, సినిమాలకు తోడుగా రావడానికి ఆకర్షణీయమైన కుర్రాళ్లను పంపుతామని 50 శాతం డిస్కౌంట్ ప్యాకేజీలతో వల వేస్తున్న సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన అందమైన కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, కేటుగాళ్లు అమ్మాయిలతో సంభాషణలు మొదలుపెడతారని సజ్జనార్ వివరించారు. అడ్వాన్స్ అమౌంట్, బుకింగ్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు మరియు ఫోన్ నంబర్లు సేకరించి బెదిరింపులకు లేదా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ తరహా మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నిశితంగా దృష్టిసారించిందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కంట కనిపెట్టాలని, ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు