తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) రట్టు చేసింది. ఢిల్లీలోని శివ మార్కెట్లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్లపై అధికారులు సమన్వయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 మంది మహిళా టెలీకాలర్లు, ఒక పురుష బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఈ కాల్ సెంటర్లు గత ఏడాదిన్నర కాలంగా వేర్వేరు బృందాలుగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు ప్రధాన నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగినట్లు వెల్లడైంది. తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా ఉపయోగించుకుని తెలంగాణలోని ప్రజలకు ఫోన్లు చేసి, వివిధ రకాల మోసపూరిత పద్ధతుల ద్వారా డబ్బులు దోచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిర్వాహకులుగా ఉన్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదుపులోకి తీసుకున్న టెలీకాలర్లు, బ్యాంకు ఖాతాదారుడిని విచారిస్తూ ముఠా కార్యకలాపాలు, బాధితుల వివరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరిన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.









