ఇంట్లోకి చొరబడి దంపతుల గొంతు నులిమేందుకు యత్నం.. స్థానికుల రాకతో పరారైన దుండగులు

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలోని సంత బజారులో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. బాధితుల వివరాల ప్రకారం.. కారం సీతయ్య, దుర్గమ్మ దంపతులు తమ కుమార్తె తులసి, కుమారుడు కుమార్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు.

ఇంట్లోకి చొరబడిన దుండగులు సీతయ్య, దుర్గమ్మ దంపతుల గొంతు నులిమేందుకు ప్రయత్నించినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తులసిని కూడా దుండగులు గొంతు నులిమేందుకు ప్రయత్నించగా, ఆమె వారి నుంచి తప్పించుకుని గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని ఇంట్లో నిద్రిస్తున్న కుమార్ మేల్కొని బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. దుండగులు అతడిని ఓ గదిలోకి నెట్టి తలుపు బయట నుంచి గడియ పెట్టారు.

గదిలో చిక్కుకున్న కుమార్ తలుపు తీయాలంటూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న స్థానికులు మేల్కొని బయటకు వచ్చారు. దీంతో స్థానికులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు భయపడి ఇంటి వెనుక వైపు ఉన్న పొలాల్లోకి పారిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు