రోజా సంచలన ఆరోపణలు.. లోకేష్‌ ‘రైజింగ్‌ స్టార్‌’ కాదు ‘స్కామ్‌ స్టార్‌’ అంటూ విమర్శలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. లోకేష్‌ రైజింగ్‌ స్టార్‌ కాదని, అవినీతిలో ఎదిగిన ‘స్కామ్‌ స్టార్‌’ అంటూ విమర్శించారు. ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ పేరుతో సైకో పనులు చేస్తున్నారని ఆరోపించిన రోజా.. మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అవినీతి, స్కామ్‌ల కోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని, ఆ డబ్బును విదేశాల్లో దాచేందుకే వెళ్తున్నారని ఆరోపించారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని రోజా ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని, పేకాట ఆడేవారికి సైతం డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల తరఫున తాము ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గతంలో వైఎస్‌ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించారని రోజా గుర్తుచేశారు. ఆ కేసుల్లో జగన్‌కు క్లీన్‌చిట్‌ వచ్చిందని పేర్కొంటూ.. లోకేష్‌పై తాము చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. లోకేష్‌పై నమ్మకం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నారని రోజా విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు