తెలంగాణలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవనాలు నిర్మించడం సులభమేనని, కానీ విద్యార్థుల కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని అన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకడంతో పాటు కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం వంటి భేదాలను తొలగించి ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రధాన ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. విద్య ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.









