అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
2021 మార్చి 12న ఏపీ సీఐడీ చంద్రబాబు, పి. నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అమరావతి భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు జూలై 15న పూర్తిగా కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి జీవోలు జారీ చేయడం మాత్రమే ఆధారంగా క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో చంద్రబాబు, పి. నారాయణకు ఈ కేసులో ఊరట లభించినట్లయింది.









