కరీంనగర్ నగర ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ఇటీవల వచ్చిన వార్తలు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో కలిసి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన మేయర్.. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్లో జరుగుతున్న నీటి శుద్ధీకరణ ప్రక్రియ, ఫిల్టరేషన్ వ్యవస్థ, క్లోరినేషన్ విధానాన్ని మేయర్ పరిశీలించారు. అలాగే శుద్ధి చేసిన నీటి నిల్వ ట్యాంకులు, నీటి నాణ్యత, నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మేయర్ అధికారులకు సూచించారు. నీటి శుద్ధీకరణ, క్లోరినేషన్, సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.









