నాగబాబుకు క్యాబినెట్ హోదా.. శాసనమండలిలో ఆసక్తికర పరిణామం

జనసేన ఎమ్మెల్సీ, సినీ నటుడు కొణిదెల నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ పర్యావరణ, అటవీశాఖకు సంబంధించిన గ్రీన్‌ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆయనకు కీలక స్థానం కల్పించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నాగబాబు రాజకీయ ప్రస్థానంలో ఈ పదవి మరో కీలక మలుపుగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై జనసేన వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, నాగబాబు నియామకం నేపథ్యంలో శాసనమండలిలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాగబాబును పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరూ కొద్దిసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. కుటుంబ సభ్యుల గురించి త్రిమూర్తులు ఆరా తీయడంతో పాటు ‘పిల్లలు బాగున్నారా?’ అని ప్రశ్నించారు. అలాగే నాగబాబు ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం శాసనమండలిలో ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు