ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలు అధికారికంగా మొదలయ్యాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానంగా నిలిచింది. విమానం ల్యాండ్ అయిన సమయంలో విమానాశ్రయంలో సందడి నెలకొంది. తొలిసారిగా కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ప్రయాణికులు తమ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా కనిపించారు. విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.









