రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. కుటుంబం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకినట్లు సమాచారం అందడంతో అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గోదావరిలో విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబం ఈ ఘటనకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.









