స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 175 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఇన్‌చార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, ఓటర్ల జాబితా విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని నేతలకు సూచనలు చేశారు.
అదే సమయంలో 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించినట్లు సమాచారం. బూత్ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు ఓటర్ల జాబితాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైసీపీ నాయకత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.









