సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలి
టీయూడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖదీర్
ఖమ్మం జిల్లా : 24: TODAY 9 NEWS:
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, పేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తూ, ప్రజాస్వామ్యానికి ఊతం ఇస్తూ, ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా కృషి చేస్తూ, అవినీతిని ప్రశ్నించే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని టీయూడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఖదీర్ పిలుపునిచ్చారు.
జర్నలిస్టులు నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేస్తూ సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు మాత్రం చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు . ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టుల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రావడం లేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు .
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో టీయూడబ్ల్యూజేఎఫ్ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తరిస్తోందని తెలిపారు. గతంలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు.
అయితే జర్నలిస్టుల సమస్యలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైనవనే భావనను తొలగించి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు .
క్షేత్రస్థాయి జర్నలిస్టులే ఉద్యమానికి బలం అని అంటూ,
గ్రామీణ, మండల స్థాయిలో ప్రజల సమస్యలను నిత్యం వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖదీర్ తెలిపారు. వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. యూనియన్లు, రాజకీయ పార్టీలకు అతీతంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
వేర్వేరు సంఘాలు వేర్వేరు కార్యక్రమాలు చేపట్టినా, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకు సాగితేనే హక్కులను సాధించుకోవచ్చని ఖదీర్ అన్నారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టే ఉద్యమాలకు ప్రతి జర్నలిస్టు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. “కలిసి నడుద్దాం.. ఐక్యంగా పోరాడుదాం.. జర్నలిస్టుల హక్కులను సాధించుకుందాం” అని ఖదీర్ పిలుపునిచ్చారు.









